తలసాని శ్రీనివాసపై చీటింగ్ కేసు పెట్టాలి

talasaniతెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.శ్రీనివాస యాదవ్ రాజీనామా లేఖ తమకు అందలేదని స్పీకర్ కార్యాలయం వెల్లడించిందని మాజీ ఛీప్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పారు. తాము సమాచార హక్కు చట్టం కింద తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా గురించి అడిగితే అసలు లేఖే అందలేదని సమాచారం వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో నాలుగు కోట్ల మంది ప్రజలను తప్పు దారి పట్టించారని విమర్శించారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పై తక్షణమే గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ మదుసూదనాచారి , తన బాద్యత నిర్వహించకుండా, టిఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని రేవంత్ అన్నారు. అందువల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సనత్ నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా లేఖ తమకు అందలేదని స్పీకర్ కార్యాలయం వెల్లడించిందన్న అంశంపై మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దనరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తక్షణమే తలసాని రాజీనామా చేయాలని నాగం కోరారు.తలసానికి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా నైతికంగా బాద్యత వహిచాలని నాగం అన్నారు.

దీనిపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ తలసాని ప్రజాసేవ చేయడానికి వచ్చారా?లేక మోసం చేయడానికి వచ్చారా అని ప్రశ్నించారు.తలసానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, రాజ్యాంగ వ్యవస్థలను కూడా తప్పు దారి పట్టించిన తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలని ఆయన అన్నారు.