రచ్చ దెబ్బకు రికార్డులన్నీబద్దలే: చిరు

రచ్చ దెబ్బకు రికార్డులన్నీబద్దలే: చిరు

తన తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ’ సినిమా తొలిషో తర్వాత వచ్చిన స్పందనను బట్టి సినిమా సూపర్ డూపర్ హిట్టయిందని, ఈ సినిమా దెబ్బకు పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయమని చిరంజీవి అన్నారు. రచ్చ సినిమా చూసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చరణ్ గతంలో నటించిన ‘ఆరెంజ్’ సినిమా మెగా ప్లాపు కావడంతో ఈ సినిమాపై చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన చిరంజీవి….సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఎక్కడలేని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇక నేరుగా చిరంజీవి నోటి ద్వారా సినిమా హిట్ అనే టాక్ రావడంతో ఇటు జనాల్లోనూ ‘రచ్చ’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

మరో వైపు విడుదలైన అన్ని సెంటర్లలో సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వస్తోంది. మెగా అభిమానులు కోరుకునే మాస్ మసాలా అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. ‘ఏమైంది ఈ వేళ’ లాంటి చిన్న సినిమా తర్వాత చెర్రీతో చేసే అవకాశం దక్కించుకున్న సంపత్ నంది కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు.

రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.