జగన్ కి నారా లోకేష్ బహిరంగ లేఖ

Lokesh-accords-Donga-Babu-title-to-Jaganవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్రాయు బహిరంగ లేఖ.
నమస్కారములతో…
మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రికలో కథనాలు ఎంత అవాస్తవమో, అభూత కల్పనలో 7-10-2016న ప్రచురించిన వార్త ద్వారా మరోసారి స్పష్టమైంది. నేను, మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్పగారు వున్న ఫోటోకు మీ పత్రికలో వక్రభాష్యాలు జోడించి నిరాధార వార్తలు ప్రచురించడం పత్రికా విలువలను, రాజకీయ విలువలను దిగజార్చడం కాదా? సాక్షిలో వ్రాసింది వక్రభాష్యం కాదనడానికి మీ వద్ద ఏ ఆధారాలున్నాయి? అబద్ధాలు ప్రచురించి నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేసినందుకు మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి మీ గౌరవం కాపాడుకోవాలి.
జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ లో “కోర్ డ్యాష్ బోర్డుపై ప్రజెంటేషన్” ఇస్తున్న సమయంలో కూన రవికుమార్ గారు వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను, పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్పగారు వివరణ ఇస్తూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశాము. ఇందులో నేను బెదిరించడం, చినరాజప్పగారు భయపడటం అనేదానికి ఆస్కారమే లేదు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి. పైగా అది పార్టీ శాసనసభ్యులు, యంపీలు, నియోజకవర్గ ఇంచార్జిల అందరి సమక్షంలో జరిగింది. అందరూ ప్రత్యక్ష సాక్షులే. మీ సాక్షి పత్రిక వక్రభాష్యం చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే మీ అసూయ, విద్వేష రాజకీయాలకు మీరే నగుబాట్లపాలౌతున్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుందిగానీ నాపై దుష్ప్రచారం చేస్తే, నన్ను చూసి అసూయపడితే మీకు భవిష్యత్తు ఉండదు.
పెద్దల్ని, సహచరుల్ని గౌరవించడం నాకు నా తల్లిదండ్రులు నేర్పిన సంప్రదాయం. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేలా నేను వ్యవహరించను, వ్యవహరించబోను. వైద్యం చేయించుకొంటూ వర్కుషాపుకు రాలేకపోతే దాన్ని వక్రీకరిస్తారా? నాకు, నా తండ్రికి విభేదాలున్నట్లు దుష్ప్రచారం చేశారు. మీలాగా నేను తండ్రిని, తల్లిని, చెల్లిని, చిన్నాన్నను అవమానపరచను.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులూ, పెద్దల ప్రేమాభిమానాలతో చిన్నతనం నుండి పెరిగాను. సీనియర్ నాయకులను అవమానించేటటువంటి కుసంస్కారం నాకు లేదు. చినరాజప్పగారితో నాకు ఉన్నది అభిమానపూర్వక సంబంధాలేగాని, మీరు వక్రీకరించి రాసిన సంబంధాలు కాదు.
మీ తండ్రిగారితో పాటు పని చేసిన సీనియర్ నాయకులను, మంత్రులనే అగౌరవపరచి, అవమానపరిచిన చరిత్ర మీది. అందుకే వారిలో చాలామంది మిమ్మల్ని, మీ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్లారు. మీ అహంకారాన్ని, లెక్కలేనితనాన్ని, అబద్ధాలను భరించలేకే పార్టీని వీడుతున్నామని స్పష్టంగా చెప్పారు. మీరా సంస్కారం గురించి, పెద్దలను గౌరవించడం గురించి నాకు నేర్పేది?
బీజేపీ పార్టీ సమావేశాలలో పార్టీ నాయకులు వేదిక మీద ఉంటే కేంద్ర మంత్రులు కూడా సభలో కూర్చుంటారు. ఏ పార్టీలోనైనా ఇదే జరుగుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పార్టీ వేదికలలో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వేదిక మీద ఉంటే మంత్రులు సభలో కూర్చోవడం సహజం. దీనిపై కూడా నిందలు వేసి ప్రచారం చేయడం మీ అసూయ, విద్వేష స్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, నాపై నిందలు వేస్తే మీ పాపలు తొలగిపోతాయా?
నేను ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీకి ఎన్నో ఏళ్ళ నుండి కస్టపడి పని చేస్తున్నాను. మీలాగా నేను హఠాత్తుగా పైకి రాలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.
నా పైన, మా పొలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్పగారి పైన దుష్ప్రచారం చేసినందుకు మీ పత్రిక తరపున మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తప్పిదాన్ని సరిచేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దుష్ప్రచార రాజకీయాలు మాని నిర్మాణాత్మక రాజకీయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.